బీఆర్ఎస్ బురద రాజకీయాలు

బీఆర్ఎస్ బురద రాజకీయాలు

విపత్తు సంభవించినప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ఉన్నారు. బాధితులకు అండగా నిలిచారు. కానీ, బీఆర్ఎస్​ నాయకులు ఎక్కడున్నారు.. పిట్ట గూట్లో పోస్టులతో సరిపెట్టుకుని మాపై రాజకీయాలు చేస్తూ  కాలం వెళ్లదీశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అతి భారీ వర్షాలకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ  జిల్లాల ప్రజలు  తీవ్ర నష్టాలకు లోనయ్యారు.  ప్రభుత్వం పక్షాన ఆయా జిల్లాల్లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పర్యటించి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ తగు చర్యలు తీసుకున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి వరద సహాయక చర్యలో తలమునకలై పనిచేశారు. కానీ, ప్రతిపక్షంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ వరదలకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ  మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టది మరొక దారి అన్నట్టు అమెరికా నుంచి కేటీఆర్ ఎక్స్​లో అవాకులు,చవాకులు పేలుతూ ఈ మొత్తానికి  కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపిస్తుంటే నవ్వు పుట్టిస్తోంది.


మిషన్ కాకతీయలో  వేలాది కోట్లు తగలేసి వెలగ బెట్టింది.  రైతులకు ఒరగపెట్టింది ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులుగా తండ్రి, కొడుకులకు ఉంది. కానీ, ఇదేది వారికి పట్టనట్టు వ్యవహరించడం ప్రతిపక్ష నాయకుడి వైఫల్యమే.

విపత్తులపై బావ, బామ్మర్థుల రాజకీయాలు

ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ లు పెడుతూ వరదలకు కారణం కాంగ్రెస్ సర్కారేనని దుయ్యబడుతున్నారు. అమెరికా పోయి ఆనందంలో తడుస్తున్న కేటీఆర్  టైంపాస్​కు పిట్టగూట్లో పోస్ట్ లు పెడుతూ బురద రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి విషయం ఎక్స్ వేదికగా పంచుకునే  కేటీఆర్ తాను ప్రాతినిద్యం వహిస్తున్న  సిరిసిల్లలో వరదలు వస్తే  ఒక్క పోస్ట్ పెట్టలేదు. 

ఎందుకంటే పదేండ్లు మంత్రిగా ఉండి సిరిసిల్ల డ్రైన్ వ్యవస్థను బాగు చేసిందేమీలేదు. మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం దగ్గరికి పోయి హరీష్ రావు,  జగదీష్ రెడ్డి  బురద రాజకీయాలు  మాట్లాడుతున్నారు. విపత్తులు సంభవించినప్పుడు,  ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు  ప్రతిపక్ష పార్టీగా తన వంతు బాధ్యత పోషించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాల్సింది పోయి  ఇష్టారీతిన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు.  పదేండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు గడీని వదిలి బయటకురాలేదు.  ప్రజలు పక్కన పెట్టినా కేసీఆర్ తీరు మారడం లేదు.

వారు అబద్ధాలకు కేరాఫ్  ఆడ్రస్​ 

గతంలో వరంగల్, హైదరాబాద్​లాంటి మహానగరాల్లో వరదలు వచ్చినప్పుడు ముంపు బాధితులకు మీరు ఎంత పరిహారం ఇచ్చారు.  హైదరాబాద్​లో  కార్పొరేట్ ఎన్నికల ముందు వరదలు వచ్చినప్పుడు మీరు ఒక్కో వరద బాధిత కుటుంబానికి రూ. పదివేలు ఇస్తామని చెప్పి  కొందరికే ఇచ్చి మిగతావారికి మొండిచేయి చూపించారు. ఫలితంగా బీఆర్ఎస్  హైదరాబాద్​ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  ఘోర వైఫల్యం చెందింది.  ప్రజలకు మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.  

నాగర్జున ఎడమకాల్వను పదేండ్లలో పట్టించుకోలే

మాజీ మంత్రులు హరీష్​రావు, జగదీష్ రెడ్డిలు  అధికార కాంగ్రెస్​పార్టీ మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.  సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమకాల్వకు గండిపడితే ఆ పాపం కాంగ్రెస్ దే అనడం ఎంత విడ్డూరం.  పదేండ్లు  బీఆర్ఎస్ అధికారంలో ఉండి నాగార్జున ఎడమ కాలువను ఎందుకు  నిర్లక్ష్యం చేశారు. పది సంవత్సరాల పాలనలో అద్బుతమైన పాలన అందించి గొప్ప కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లు  నిర్మించామని చెప్పుకుంటూ గప్పాలు కొడుతున్న మీరు సాగర్ ఎడమ కాలువ నుంచి నీటి లీకులకు కాంగ్రెస్​ కారణం అని  విమర్శలు చేస్తున్నారు.

హరీష్ రావు  ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు సాగర్ ఎడమ కాల్వ  బలహీనమవుతోందని ఎందుకు గుర్తించలేకపోయారు?  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలోనే అన్నీ చేసేయాలని విమర్శలు చేస్తున్న మీరు పదేండ్ల పాలనపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఎడమ కాల్వకు గండిపడిందని హరీష్,  జగదీష్ లు అంటుంటే  దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది.  

ఎకరాకు పదివేలు ఇచ్చి తీరుతం

భారీ వర్షాలతో  రాష్ట్రంలో పంట నష్టం జరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎకరాకు పదివేలు బాధిత రైతులకు అందజేస్తామని ప్రకటించారు. తెలంగాణలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి  ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.  మోదీని తెలంగాణలో పర్యటించాలని కూడా కోరారు. రాష్ట్రంలో  రూ.5వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా దరిమిలా కేంద్రం ఆదుకోవాలి. రాష్ట్రంలో జరిగిన పంట నష్టం నుంచి రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర సర్కార్  ఎకరాకు రూ. పదివేల సాయం వివరాలు అందిన వెంటనే అందజేస్తోంది. 

వరద పర్యవేక్షణలో మంత్రులు

 తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తిన నేపథ్యంలో మంత్రులంతా వరద ప్రభావిత  ప్రాంతాల్లో పర్యటించి వెంటనే పరిస్థితిని సమీక్షించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన ప్రయాణించి  ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్  జిల్లా మున్నేరు ముంపు ప్రాంతంలో పర్యటించారు.  మున్నేరు బాధితులకు తక్షణ సాయం కింద రూ. పదివేలు ప్రకటించారు.  సూర్యాపేట, ఖమ్మం,  మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెంల్లో బాధితులకు అందించేందుకు  తక్షణ సాయం కింద రూ. 5 కోట్ల చొప్పున కలెక్టర్లకు భట్టి విక్రమార్క వెంటనే రిలీజ్ చేశారు. ఇదే ఖమ్మం జిల్లాలో  డిప్యూటీ సీఎం భట్టి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి,   మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రజల మధ్యలోనే ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబు  ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను, మంత్రి పొన్నం ప్రభాకర్  మిడ్ మానేరును పరిశీలించి నీటి విడుదలపై అధికారులకు తగిన సూచనలు చేశారు.  నల్గొండలో మంత్రులు  ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, వరంగల్ లో  సీతక్క ఆయా జిల్లాల్లో మంత్రులు, అధికారులను అప్రమత్తం చేస్తూ అలర్ట్ గా ఉన్నారు.  

గడి గడపదాటని మాజీ సీఎం

గతంలో వచ్చిన వరదల కారణంగా బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి చొరవ కనిపించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఆయా జిల్లాల మంత్రులు ఆయా జిల్లాల ఇన్​చార్జ్​ మంత్రులు ఆయా జిల్లాలలో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించారు.  వీలైనంత మేరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకున్నారు. 

ఇవి ప్రతిపక్షాలకు కన్పించడం లేదా? గడీల గడప దాటని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మాజీ  మంత్రులు ముఖ్యంగా అల్లుడు, కొడుకు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.  మాట్లాడేవానికి విడ్డూరంగా లేకున్నా  వినేవానికి సిగ్గు అనిపిస్తుందని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. కాళ్లు ఫామ్ హౌస్ గడీల గడప దాటకున్నా మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.

గడి గడపదాటని కేసీఆర్

రాష్ట్రంలో వరదల ప్రభావంతో విపత్తులు ఎదురైనప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గడీల గడప దాటలేదు. కనీసం ఒక్కటంటే ఒక ప్రకటన కూడా చేయలేదు. పదేండ్లు అధికారంలో ఉండి వరదలు సంభవించినప్పుడు కూడా కేసీఆర్  వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు ఎటువంటి ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు.

పదేండ్లలో ఒక్కరోజు కూడా కేసీఆర్ వరద సాయం బాధితులకు అందజేయలేదు. రాష్ట్రంలో  విపత్తులు జరిగినప్పుడు.. అధికారం ఉన్నప్పుడూ అండగా నిలువలేదు. పదేండ్ల పాలనకు చరమగీతం పాడుతూ కేసీఆర్​ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించలేకపోవడం అహంకార రాజకీయమే. 

ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్, 
వేములవాడ ఎమ్మెల్యే