రాజన్నసిరిసిల్ల/ వేములవాడ, వెలుగు: కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజా ప్రయోజనాలు, సంక్షేమానికే పెద్దపీట వేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన సంబురాల్లో భాగంగా సిరిసిల్లలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా మహిళ క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారమన్నారు.
ఎక్కడా లేని దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేశామని, వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. రుద్రంగి, కోనరావుపేట మండలాలకు కొత్తగా మంజూరైన అంబులెన్స్‌ను వేములవాడ హాస్పిటల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో వేములవాడ, సిరిసిల్లలో ఎన్నో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్నారు. రాజన్న ఆలయ విస్తరణ, రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు.