వేములవాడరూరల్, వెలుగు: రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నామని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ రిజర్వాయర్‌ను ఎల్లంపల్లి నీటితో నింపగా.. ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రోజుల కింద మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ జిల్లాకు రాగా.. ఫాజుల్‌నగర్ రిజర్వాయర్‌కు నీళ్లు విడుదల చేయాలని రైతుల తరఫున తాను కోరినట్లు గుర్తుచేశారు.
దీంతో సమ్మర్ రాకముందే ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. గతంలో రైతులు రోడ్డెక్కితేనే నీరు విడుదల చేసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు ముందుగానే విడుదల చేశామన్నారు. రైతుల ప్రయోజనాల కోసం మూలనపడ్డ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, లీడర్లు రంగు వెంకటేశ్‌గౌడ్, కరుణాకర్, స్వామి, తిరుపతి, పర్శరాం, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.