- భక్తుల కోసం అత్యాధునిక వసతులతో 96 గదుల నిర్మాణం
- రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రివ్యూ
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణమాసం నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. వీటీడీఏ, వేములవాడ ఆలయ అభివృద్ధిపై ఈవో గెస్ట్‌హౌజ్‌లో సోమవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఈవో వినోద్‌రెడ్డితో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రేక్ దర్శనాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని, వీఐపీల వల్ల ఇతర భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. రాజన్న గుడి చెరువులో భక్తుల కోసం అత్యాధునిక వసతులతో రూ. 32 కోట్ల అంచనాలతో 96 గదులు నిర్మించనున్నామని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
గుడి చెరువులో బండ్ మరియు పార్క్ నిర్మాణాన్ని ఆగస్టు ఆఖరులోగా పూర్తి చేస్తామన్నారు. నటరాజ, సూర్య నమస్కారం విగ్రహాలు, అంఫీ థియేటర్, ఇంటర్నల్ పాత్‌వే, జోన్ వన్ ప్లాంటేషన్ పూర్తికాగా, లాండ్ స్కేప్, గ్రానైట్ ఫ్లోరింగ్ వంటి పనులు 80 శాతం పూర్తి అయ్యాయన్నారు. వీటీడీఏ పనుల్లో భాగంగా ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో రూ. 2 కోట్లతో చేపట్టిన మున్సిపల్ పార్క్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయన్నారు. సమావేశంలో ఆర్డీవో రాజేశ్వర్, టూరిజం శాఖ డీఈ విద్యాసాగర్, జేఈ జీవన్, ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, రామేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, ఆర్‌అండ్‌బీ ఏఈ సతీశ్, డీటీసీపీవో అన్సారీ పాల్గొన్నారు.