వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణ అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా కలిసికట్టుగా పనిచేయాలని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ మున్సిపల్ ఆఫీస్‌లో చైర్‌పర్సన్ మాధవి అధ్యక్షతన కౌన్సిల్ జనరల్బాడీ మీటింగ్ జరిగింది. ఎజెండాలో పొందుపరిచిన అంశాలను కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు మంజూరు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు పాలకవర్గ సభ్యులు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మూలవాగులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు వెడల్పు తో పాటు అర్ధాంతరంగా ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులు, ఆగిపోయిన స్టేడియం పనులను పూర్తిచేస్తామన్నారు. అంతకుముందు పట్టణంలోని మహా లింగేశ్వర గార్డెన్స్ లో వేములవాడ అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 208 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆయాకార్యక్రమాల్లో కమిషనర్ అన్వేష్ , వైస్ చైర్మన్ బింగి మహేశ్, ఆర్డీవో రాజేశ్వర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.