- రివ్యూ మీటింగ్‌లో విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు : రాజన్న ఆలయానికి వచ్చే సామాన్య భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా, టీటీడీ తరహాలో వీఐపీ బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. మంగళవారం మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఓపెన్ స్లాబ్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన జాతర సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మహా శివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం గంట చొప్పున అవకాశం ఇవ్వాలన్నారు. శివస్వాములు, పుర ప్రముఖులకు సులభ దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని, దర్శన సమయాన్ని కూడా పెంచాలన్నారు. భక్తుల తాకిడి పెరిగినందున ప్రత్యేక బస్సులు నడిపించాలన్నారు.
బస్టాండ్, క్యూలైన్లు, టెంపుల్‌లో తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ఆలయం దాకా, వేములవాడను కనెక్ట్ చేసే అన్ని అప్రోచ్ రోడ్లను , పట్టణ అంతర్గత రోడ్లకు ఈ నెలాఖరులోగా రిపేర్లు పూర్తి చేయాలని ఆర్‌అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఆలయ వసతి గదుల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
అనంతరం విప్, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు రాజన్న ఆలయాన్ని పరిశీలించారు. సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషినల్కలెక్టర్ పూజారి గౌతమి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, ట్రైనీ ఐపీఎస్రాహుల్ రెడ్డి, ఈవో కృష్ణ ప్రసాద్, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ నాగేంద్ర చారి,
పాల్గొన్నారు.