ధర్మారం, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిద్దామని విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ తెలంగాణలో 15 ఎంపీ స్థానాలను గెలిపించి హైకమాండ్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంలో పదేళ్లు కీలక పదవుల్లో ఉన్న బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. కాకా కుటుంబానికి పెద్దపల్లి నియోజకవర్గంతో దశాబ్దాల అనుబంధం ఉందని, యువకుడు, విద్యావంతుడైన వంశీకృష్ణను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాడన్నారు.
అనంతరం వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో లీడర్లు కోడారి అంజయ్య, కాడే సూర్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి, కొత్త నరసింహులు, దేవి జనార్ధన్, రాజేశం గౌడ్, లింగయ్య గౌడ్, రూప్లా నాయక్, రవీందర్ రెడ్డి, తిరుపతి, రాజేశం, శ్రీనివాస్, చిరంజీవి పాల్గొన్నారు.