
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్మపురి, మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలపై వివక్ష చూపిందని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకే నీళ్లు తరలించుకున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఇరిగేషన్‌పై శ్వేతపత్రం సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గంలో పత్తిపాక రిజర్వాయర్ కట్టిస్తామని అసెంబ్లీలో ప్రకటించినా కట్టలేదని మండిపడ్డారు. అంబేద్కర్– ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరును మార్చి గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని కాదని లిఫ్టుల ద్వారా ఎల్లంపల్లి నుంచి మేడారం మీదుగా మిడ్ మానేరుకు, అక్కడి నుంచి రంగనాయకసాగర్, కొండపోచంపల్లి రిజర్వాయర్లకు నీళ్లు తీసుకువెళ్తున్నారని తెలిపారు. కాళేశ్వరంతో ధర్మపురి, మంథని, పెద్దపల్లికి నీళ్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.