
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఓల్డ్ సిటీ మాత్రం డెవలప్ కావడం లేదని మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. విజన్ 2050లో భాగంగా ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘‘గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అన్నది. ఇప్పుడు పవర్లో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ రైజింగ్ అంటున్నది.
రాష్ట్రాన్ని 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుంచి ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఎట్ల తీసుకెళ్తారో చెప్పాలి. ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ, మెగా అర్బన్ ప్రాజెక్ట్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఫార్మా క్లస్టర్స్పై అఖిపక్షాన్ని పిలిచి చర్చించాలి. మూసీ రివర్ ఫ్రంట్, ఉస్మానియా హాస్పిటల్ నిర్మిస్తుండటాన్ని స్వాగతిస్తున్నాం. కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నిధులు కేటాయించాలి.
బడ్జెట్లో కేటాయించినన్ని నిధులు ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. రోడ్డు విస్తరణలో పోయిన వక్ఫ్ ల్యాండ్‌కు పరిహారం ఇవ్వాలి. ఫలక్‌నుమా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో హాకర్ పాలసీ తీసుకొస్తే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది’’అని అక్బరుద్దీన్ అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి మైనార్టీలకు ఇస్తున్నారని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.