నిర్మల్, వెలుగు: తనను భారీ మెజార్టీతో గెలిపించిన నిర్మల్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను ఆశీర్వదించిన ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు.
తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తానన్నారు. నిర్మల్ ను స్మార్ట్ సిటీగా మార్చడమే కాకుండా నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆక్రమణ గురైన భూములపై విచారణ జరిపించి వాటన్నిటిని పేదలకు పంచుతానన్నా రు. బ్రోకర్ల చేతిలో ఉన్న అక్రమ భూములను స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు చేపడతానన్నారు.
తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, కేవలం ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గత పది యేళ్ల నుంచి తన వెంట నడిచిన కార్యకర్తలందరికీ రుణపడి ఉంటానన్నారు. సమస్యల పరిష్కారంతోపాటు అభివృద్ధి కోసం కృషి చేస్తానని వెల్లడించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, లోక్ సభ ఇన్ చార్జి అయనగారి భూమయ్య, అయిండ్ల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.