నిర్మల్, వెలుగు: నిర్మల్ లో కబ్జాకు గురైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తన కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పా టు చేసినట్లు చెప్పారు.
ప్రజలు తమ సమస్యలను కాల్ సెంటర్కు ఫోన్లో తెలపాలని, ఆ సమస్యలను రిజిస్టర్ చేసుకొని వాటిని సంబంధిత అధికారులకు నివేదించి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను మోసం చేస్తోందని.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు కాంగ్రెస్పార్టీ ఇచ్చిన హామీపై ఇప్పటివరకు స్పష్టత లేదన్నారు.
నిరుద్యోగులను మోసం చేసేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి చేరువవుతాయన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జ్ అయ్యన్నగారి భూమయ్య, మల్లారెడ్డి, హరీశ్ రెడ్డి, రమేశ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.