- ఎమ్మెల్యే మందుల సామేల్
తుంగతుర్తి, వెలుగు : ప్రతిఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు. శుక్రవారం తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో కాటమయ్య పండుగకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేసి గౌడ కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇటీవలే కాటమయ్య కిట్లను పంపిణీ చేసిందన్నారు.
అంతకుముందు తిరుమలగిరి ఎంపీడీవో కార్యాలయంలో నాగారం, తిరుమలగిరి మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి భూ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, తహసీల్దార్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.