- ఎమ్మెల్యే మందుల సామేల్
తుంగతుర్తి, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. గురువారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీలో ఏ ఒక్క రికార్డు సరిగా లేకపోవడంతో కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడి చెత్త అక్కడే ఉందని, ప్రజలు దోమలతో ఇబ్బంది పడుతున్నా కార్యదర్శి శ్రీనివాస్ పట్టించుకోవడంలేదన్నారు.
ఈ ఘటనపై గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి కలెక్టర్ కు ఫోన్ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శేషుకుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
శాలిగౌరారం (నకిరేకల్), వెలుగు : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. గురువారం కట్టంగూరు మండలం ఐటిపాముల నుంచి శాలిగౌరారం మండలంలోని వల్లాల ,పెర్క కొండరాం వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ను రూ.100 కోట్లతో నిర్మిస్తున్న పైపులైన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తో వల్లాల గ్రామంలో 1529 ఎకరాలు, పెర్క కొండారంలో 800 ఎకరాలు సాగులోకి వస్తాయని ఆయన తెలిపారు.