ముంపు బాధితులను ఆదుకుంటాం : కలెక్టర్ బాదావత్ సంతోష్

ముంపు బాధితులను ఆదుకుంటాం : కలెక్టర్ బాదావత్ సంతోష్
  • నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులతో ఎమ్మెల్యే, కలెక్టర్ మీటింగ్ 

అచ్చంపేట, వెలుగు:  నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న మర్లపాడు తండా, కేశ్య తండా, మన్నేవారి పల్లి గ్రామాల నిర్వాసితులను రాజకీయాలకతీతంగా ఆదుకుంటామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.  నక్కల గండి ప్రాజెక్టులో ఇండ్లను కోల్పోనున్న మర్లపాడు తండా గ్రామస్తులతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంశంపై మంగళవారం గ్రామసభ నిర్వహించారు.  

అచ్చంపేట ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సంతోష్,  అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు. ఆర్ అండ్ ఆర్ ద్వారా భూ సేకరణ, ఇండ్ల నిర్మాణానికి అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో అనుకూలమైన ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా అన్ని వసతులతో ఆదర్శవంతమైన కాలనీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.  హాజీపూర్ కు వెళ్లేందుకు ఇష్టపడని నిర్వాసితులకు సిద్దాపూర్ సమీపంలో పునరావసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలు గమనించి ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.   మైదాన ప్రాంతానికి వెళితే తమ ఏజెన్సీ హక్కులు కోల్పోతామని ముంపు బాధితులు అన్నారు. 
అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్ , తహసీల్దార్ చంద్రశేఖర్, నేతలు రాహుల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు, ముంపు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.