పేదోడి సొంతింటి కల నెరవేర్చాం: మహిపాల్ రెడ్డి

పేదోడి  సొంతింటి కల నెరవేర్చాం: మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, వెలుగు : నియోజకవర్గంలో పేదోడి  సొంతింటి కల నెరవేర్చామని పటాన్​చెర్​ ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి చెప్పారు. బుధవారం స్థానిక మీటింగ్​ హాల్​లో ఎమ్మెల్యేతోపాటు  కలెక్టర్ శరత్​ కుమార్ సమక్షంలో మొదటి విడత డబుల్​బెడ్​రూమ్​లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు ఆధునిక వసతులతో అత్యంత ఖరీదైన ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు, ఉస్మాన్ నగర్, అమీన్​పూర్​ పరిధిలో నిర్మించిన 30 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఇప్పటికే నాలుగు వేల ఇండ్లను కేటాయించామన్నారు.  

లబ్ధిదారులకు విడతలవారీగా లాటరీ పద్ధతిన ఇండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. మొదటి విడతలో ఎంపికైన పటాన్​చెరు పట్టణం జేపీ కాలనీకి చెందిన శ్రీలక్ష్మికి ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  కలెక్టర్ మాట్లాడుతూ  అర్హులైన 4137 మంది లబ్ధిదారుల లిస్టు నుంచి రాండమైజేషన్ పద్ధతిలో 500 మంది లబ్ధిదారులను మొదటి విడతగా ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధుఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేశ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, తహసీల్దార్ భాస్కర్ పాల్గొన్నారు.