ప్రాజెక్టులో చనిపోయిన చేప పిల్లలను వదిలిన్రు

శాయంపేట, వెలుగు: చనిపోయిన చేప పిల్లలను ప్రాజెక్టులో వదిలారంటూ ఎమ్మెల్యే, ఆఫీసర్లపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్ట్‌‌లో పోసేందుకు 11.7 లక్షల చేపపిల్లలను ప్రభుత్వం మంజూరు చేసింది. శుక్రవారం మత్స్యశాఖ ఆఫీసర్లు రెండు డీసీఎం వ్యాన్లలో చేప పిల్లలను తీసుకొచ్చారు. మత్స్యకారులు ఒకేసారి 11.7 లక్షల చేప పిల్లలు ప్రాజెక్ట్‌‌లో వదిలిపెట్టాలని ఫిషరీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఏడీ విజయభారతితో గొడవ పెట్టుకున్నారు. అదే సమయంలో అక్కడికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ గండ్ర జ్యోతి చేరుకోగా ఆఫీసర్లు పూల బొకేలు ఇచ్చారు. దీంతో మత్స్యకారులు తమ సమస్య పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చారా.. లేక ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు ఇచ్చే పూల బొకేలు తీసుకోవడానికి వచ్చారా అని నిలదీశారు.

మత్స్యకారులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని, ప్రభుత్వ లెక్కల ప్రకారం చేప పిల్లలు పోయాలని ఎమ్మెల్యే ఆఫీసర్లకు సూచించారు. తర్వాత ఎమ్మెల్యే, జడ్పీ చైర్​పర్సన్​లు చేప పిల్లలు పోశారు. కొద్దిసేపటి తర్వాత చూడగా చేప పిల్లలన్నీ చనిపోయి పైకి తేలి కన్పించడంతో మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చచ్చిపోయిన చేప పిల్లలను సప్లయ్‌‌ చేసిన కాంట్రాక్టర్‌‌, ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌ చేశారు.