నేరడిగొండ, వెలుగు: గల్లీ గల్లీలో సీసీ రోడ్లు ఉండేలా చర్యలు చేపడతానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని దర్భ తండాలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్వాడీ భవన నిర్మాణానికి, రూ.5 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణానికి శనివారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గిరిజన గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని, గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం క్యాలెండర్ ను ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేను కలిసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ వైస్ ఎంపీపీ మహేందర్ రెడ్డి, మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, మాజీ జడ్పీటీసీ డా.జహీర్, నేరడిగొండ, బోథ్ ఎంఈవోలు తదిత రులు పాల్గొన్నారు.