కాంగ్రెస్​లో చేరిన మరో బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే

  • సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీ
  • త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలూ కాంగ్రెస్​లోకి!

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంటూ పార్టీని వీడుతున్నారు. కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. తాజాగా శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హస్తం గూటికి చేరారు. శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. గాంధీతో పాటు మరో నలుగురు బీఆర్ఎస్  కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరారు. వారిలో శేర్ లింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ ఉన్నారు. ఈ ప్రోగ్రాంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కారు దిగి కాంగ్రెస్​లో చేరిన తొమ్మిది మంది..

 బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది. దానం నాగేందర్ తో మొదలైన చేరికల పర్వం.. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ వరకు కొనసాగింది. త్వరలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన మరో ఐదు నుంచి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నెల 24 నుంచి  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఈలోపే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు పీసీసీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ బలం 65 ఉండగా.. తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం 74 కు చేరింది. 

నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్​లోకి: అరికెపూడి గాంధీ

రేవంత్ రెడ్డి, తాను కష్టకాలంలో కలిసి పనిచేశామని, ఇద్దరం పాత మిత్రులమని శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారని, నియోజకవర్గ అభివృద్ధి  కోసం కార్యకర్తలు, నేతల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ లో చేరినట్టు గాంధీ చెప్పారు.

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భేటీ

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో పటాన్‌‌‌‌‌‌‌‌ చెరు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శనివారం భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రేవంత్ ఇంటికెళ్లిన మహిపాల్ రెడ్డి.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరే అంశంపై చర్చించినట్టు తెలిసింది. ఆయనతో పాటు మెదక్ జిల్లాకు చెందిన మరో నలుగురు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఒకేసారి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరేందుకు సిద్ధమైనట్టు  ప్రచారం జరుగుతున్నది.