హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరోసారి విరుచుకు పడ్డారు. శుక్రవారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఇది బీఆర్‌ఎస్‌కు, గాంధీకి యుద్ధం కాదని.. నేను ఓ చీటర్, బ్రోకర్‌తో ఫైట్ చేస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను క్రమశిక్షణ గల నేతనని.. నన్ను రెచ్చగొట్టడం వల్లే చిల్లరగాడితో ఫైట్ చేస్తున్నానని అన్నారు. ఎంతో మందిని మోసంచేసిన చీటర్ కౌశిక్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని.. ఆంధ్రా, తెలంగాణ పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి.. అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని.. కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ స్పందించాలన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నాపై పూలకుండీలు, రాళ్లతో దాడి చేశారని.. అందుకే మా కార్యకర్తలు, అభిమానులు కోపానికి గురి అయ్యారని తెలిపారు. తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటున్న కౌశిక్ రెడ్డి కామెంట్స్‌పై స్పందిస్తూ.. పోలీసుల సెక్యూరిటీ మధ్య ఉన్న కౌశిక్‌పై మేం దాడి ఎలా చేయగలమని ప్రశ్నించారు.
కాగా, అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయాలను వేడెక్కించిన విషయం తెలిసిందే. గురువారం (సెప్టెంబర్ 13) కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు, అభిమానులు గుడ్లు, టమాటాలతో దాడికి పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకుంటన్నారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.