ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) చైర్మన్ గా నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్వగ్రామం సిరికొండ మండలం రావుట్ల గ్రామం. 1973లో పోలీసు పటేల్ గా పనిచేసిన బాజిరెడ్డి గోవర్ధన్ 1981లో చిమన్ పల్లి గ్రామ సర్పంచ్ గా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సర్పంచ్ గా తొలిసారి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన 1986లో మండల పరిషత్ లు ఏర్పడ్డాక మండలాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అటు తర్వాత ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్రట్ గా ఎన్నికైన ఆయన 1994లో ఆర్మూరు అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైనా తన స్థాయిని ఉనికిని పెంచుకున్నారు. అదే ఊపును కొనసాగిస్తూ 1999లో ఆర్మూరు నుంచి, 2004లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఈయన రాష్ట్ర విభజన పరిణామాలతో టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు కూడా వైఎస్ కుమార్తె షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆయనకు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గిరీ కట్టబెట్టడం ప్రాధాన్యతం సంతరించుకుంది. జిల్లాలో టీఆర్ఎస్ కు బలమైన నాయకత్వాన్ని కొనసాగించే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆర్టీసీ చైర్మన్ గిరీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సీఎం కేసీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.