దేవరకొండ, కొండమల్లేపల్లి, పీఏపల్లి, వెలుగు : జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. మంగళవారం పీఏపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ డిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు.
నాడు ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను మూడేండ్లలో పూర్తి చేస్తుందని చెప్పారు. అంతకుముందు దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ, డిండి, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాలకు చెందిన 116 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
అనంతరం కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి, పీఏపల్లి మండలంం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ జమునామాధవరెడ్డి, పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, పీఏసీఎస్చైర్మన్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.