ఉప్పల్, వెలుగు: ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించి, వానాకా లంలో ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచించారు. మంగళవారం ఉప్పల్ సర్కిల్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు అధ్యక్షతన అన్నివిభాగాల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రధానంగా వానాకాలంలో సర్కిల్ లోని లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మురుగు నీరు నిలవకుండా, దోమల నివారణకు నల్లచెరువులోని గుర్రపు డెక్క తొలగింపుపై దృష్టిసారించాలని సూచించారు.
అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ఉప్పల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఉప్పల్ భగాయత్ లో ఇష్టానుసారంగా అక్రమంగా కట్టడాలు నిర్మిస్తుండగా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నావంటూ ఉప్పల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలు నిర్మించుకుంటే నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని, పెద్దలు అక్రమంగా కడుతుంటే సప్పుడు చేయవెందుకని ప్రశ్నించారు. వారికో న్యాయం.. వీరికో న్యాయం ఎలా అవుతుందని ఆఫీసర్ పై ఎమ్మెల్యే మండిపడ్డారు. చిలుకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత, వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్, ఈఈ నాగేందర్, ఇరిగేషన్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.