మిర్యాలగూడ, వెలుగు: గురుకుల విద్యార్థినిలకు క్వాలిటీ లేని టిఫిన్ పెట్టడంపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్యాలగూడలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల, వసతి గృహాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టిఫిన్ను పరిశీలించి క్వాలిటీ లేకపోవడంతో ప్రిన్సిపల్ను మందలించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోందని, పోషక విలువలతో కూడిన ఆహారం అందజేయాలని సూచించారు.
విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తనకు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం మిర్యాలగూడ రాజీవ్ గాంధీ స్టేడియం ఆవరణలో నిర్మిస్తున్న 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించి మాట్లాడారు. పనులను నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్, వార్డు కౌన్సిలర్ జానిపాష, ఎంఈ వో బాలాజీ నాయక్ ఉన్నారు.