యాదగిరిగుట్ట, వెలుగు : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ వేర్వేరు కావని, జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. శనివారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శ్మశానవాటిక నిర్మాణానికి శంకుస్థాపన, మల్లాపూర్ జడ్పీహెచ్ఎస్ లో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ లు పంపిణీ చేశారు. అనంతరం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపుల్ఆర్ పై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని పేర్కొన్నారు. త్రిపుల్ఆర్ పనులు త్వరగా షురూ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే.. మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ తో జతకట్టిన బీజేపీ నాయకులు అడ్డుకోవడానికి ధర్నాలు చేయడమేంటని.? ప్రశ్నించారు. త్రిపుల్ఆర్ పై బీజేపీ స్టాండ్ ఏంటో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూములు సేకరించకుండా త్రిపుల్ఆర్ ఎలా నిర్మించాలో ప్రతిపక్షాలు చెప్పాలని సవాల్ విసిరారు.
పదవీకాలం ముగిసినా బాధ్యతగా వ్యవహరించాలి..
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పాలకవర్గం టెన్యూర్ ఆదివారంతో ముగుస్తున్నా.. ప్రజల కోసం ప్రస్తుత చైర్ పర్సన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సూచించారు. యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన చివరి సర్వసభ్య సమావేశానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుధా హేమేందర్ గౌడ్, వైస్ చైర్మన్ రాజు, కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.