- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : విద్యార్థి దశలో టీచర్లు, లెక్చరర్లు నేర్పిన విద్యాబుద్ధుల వల్లే నేడు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి దోహదపడ్డాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. శనివారం బొమ్మలరామారం మండలం జలాల్ పూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పెండెం నాగార్జున, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ తూముల వెంకటేశ్వరరావుల పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదన్నారు. దేశానికి ఎంతోమంది మేధావులను అందించిన టీచర్లకు ప్రతిఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. అంతకుముందు పదవీ విరమణ పొందిన టీచర్లను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాదగిరిగుట్టలోని తన ఆఫీస్ లో విద్యుత్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.