సాగునీటి కాల్వలను గత సర్కారు పట్టించుకోలే :ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

సాగునీటి కాల్వలను గత సర్కారు పట్టించుకోలే :ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : పంటలకు సాగు నీరందించే విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి తెలిపారు. గురువారం అసెంబ్లీలో వారు వేర్వేరుగా మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండకు బునాధిగాని కాల్వ, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వల కోసం రూ.500 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్​ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో మొదలైన ఈ కాల్వలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

తమ ప్రభుత్వం పవర్​లోకి వచ్చిన తర్వాత కాల్వల ద్వారా సాగునీరు అందిస్తోందని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గాల్లోని చెరువులు నింపామని చెప్పారు. బునాధిగాని కాల్వ, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలు పూర్తయితే ఉమ్మడి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా బస్వాపూర్​ రిజర్వాయర్​కు సంబంధించిన పరిహారం, ఆర్​అండ్​ఆర్ కోసం నిధులు అందించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి కోరారు.

అనంతరం సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డిని ఎమ్మెల్యేలు సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్​ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు.