- అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో నీ సంగతి చూస్తా
- ఇల్లెందు ఎంపీపీ భర్తను బెదిరించిన ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్
- సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తున్న వాయిస్ రికార్డ్
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ‘నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నవ్. గెలిచేది బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియనే. అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో నీ సంగతి చూస్తా’ అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ భర్త హరిసింగ్..ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ భర్త జానీని బెదిరించిన ఫోన్ కాల్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నది. ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మతో పాటు పలువురు రెండు రోజుల కింద బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో ఎమ్మెల్యే హరిప్రియ సింగ్ భర్త హరిసింగ్ బుధవారం ఎంపీపీ భర్త జానీకి ఫోన్ చేసి బెదిరించారు.
అందులో ‘జానన్న నమస్తే.. కనకన్న రేపు గెలవకపోతే అప్పుడు నీ సంగతేంది? అప్పుడైతే హరిసింగ్ఊరుకోడు కదా. నువ్ఎక్కడెక్కడ వేలు పెట్టినవ్.. ఎక్కడెక్కడ ఏం చేసినవో.. అన్నీ తెలుసు...ఏదీ వదిలిపెట్టం. వంద శాతం తవ్వుతం. నువ్వు ఏం చేసినవో అన్నీ చూస్తాం. నీ భూములు, నీ కబ్జాలు అన్నీ అప్ టూ డేట్ఉన్నయ్. నీ కోసం అన్నీ చేసిన. ఎమ్మార్వోకు చెప్పా. దొంగ పనులు చేసుకుంటూ వెళ్తున్నవ్. పొంగులేటి కాదు వాళ్ల జేజమ్మ వచ్చినా హరిప్రియ గెలుపును ఆపలేరు. 20 రోజులు చాలు నీ సంగతి చూసేందుకు’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయమై ఎంపీపీ భర్త జాని మాట్లాడుతూ హరిసింగ్ తనకు ఫోన్ చేసి బెదిరించాడని, అతడి నుంచి ప్రాణ భయం ఉందని, రక్షణ కల్పించాలని కోరాడు.