నల్గొండ అర్బన్, వెలుగు: నల్లగొండ పట్టణంలో అక్టోబర్ 2 న పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ పర్యవేక్షించారు. మంత్రి ప్రారంభించనున్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ , అడ్మినిస్ట్రేషన్ , పరీక్షల బ్రాంచ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ తదితర భవనాల ఎంజీయూ వీసీ గోపాల్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
అనంతరం మర్రి గూడ బైపాస్ జంక్షన్, ఐటీ హబ్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఎన్‌జీ కాలేజీ పనులను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్టోబర్ 2న మంత్రి కేటీఆర్ నల్గొండ పట్టణంలో రూ.750 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వివరించారు.
సాయంత్రం 4 గంటలకు ప్రగతి నివేదన సభ ఉంటుందని, ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ రమణాచారి, ఆర్‌అండ్‌బీ ఈఈ నరేందర్ రెడ్డి, ఈఈ సత్యనారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారి నాగిరెడ్డి పాల్గొన్నారు.