బీసీగా పుట్టడమే నేను చేసిన పాపమా ? : పిల్లి రామరాజు యాదవ్​

నల్గొండ అర్బన్  :  ఓటమి భయంతో ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్​ అసమ్మతి నేత, ఆర్​కేఎస్​ ఫౌండేషన్​ చైర్మన్​  పిల్లి రామరాజు యాదవ్​ ఆరోపించారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి, పోలీసుల తీరును నిరసిస్తూ మంగళవారం నల్గొండలోని రామాలయం నుంచి ఎస్పీ ఆఫీసు వరకూ నల్ల కండువాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ కంచర్ల భూపాల్​రెడ్డి అరాచకాల నుంచి నల్గొండ నియోజకవర్గాన్ని కాపాడుకుందాం’ అంటూ ప్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు.

 తర్వాత ఏఆర్​ ఏఎస్పీ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు. తన ఫ్లెక్సీలు చించివేసిన ప్రాంతానికి వెళ్లి ఎమ్మెల్యే అనుచరులు చేసిన పనిని చూపించారు. రామరాజు యాదవ్​ మాట్లాడుతూ తాను నల్గొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ పరిధిలోని వివిధ వార్డుల్లోని ప్రజలకు వినాయక విగ్రహాలు ఇప్పించానని, వాటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కార్యకర్తలతో వెళ్తున్న తనను ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి డైరెక్షన్ లో పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 

తనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఎమ్మెల్యే ఇదంతా చేయిస్తున్నాడన్నారు. బీసీ బిడ్డగా పుట్టడమే తాను చేసిన పాపమా అని ప్రశ్నించారు. తన అనుచరులపై కేసులు పెట్టడం సరైందికాదన్నారు. హైదరాబాద్​రౌడీలతో నల్గొండలో ఎమ్మెల్యే ర్యాలీలు నిర్వహించి షో చేశాడని, వారితో తనను చంపించాలని కుట్ర చేస్తున్నారన్నారు. 

ఎమ్మెల్యే సొంత ఊరిలోనే ఆయనకు ప్రజాబలం లేదని, ఆ ఊరి జనాలే తన దగ్గరకు వస్తున్నారని, పోలీస్​ఎస్కార్ట్​ లేకుండా ప్రజా క్షేత్రంలో తిరిగితే ఆయన ఏమిటో తెలుస్తుందన్నారు. బీసీ , యాదవ సంఘం నాయకులు అల్లి వేణుయాదవ్​, అల్లి సుభాష్ యాదవ్​, కృష్ణంరాజు యాదవ్​ పాల్గొన్నారు.