- ఓటమి షాక్‌తో మతి భ్రమించినట్లుంది
- 420 హామీల పేరుతో బుక్‌రిలీజ్.. సిగ్గుమాలిన చర్య
యాదగిరిగుట్ట/యాదాద్రి, వెలుగు: రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి, రాజకీయంగా బొంద పెట్టినా కేటీఆర్ బుద్ధి మారలేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విమర్శించారు. ఓటమి షాక్‌తో కేటీఆర్ మతి భ్రమించిందని, ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. గురువారం యాదగిరిగుట్టలోని ఇంట్లో విప్అయిలయ్య మీడియాతో మాట్లాడారు.
పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు, డబుల్బెడ్రూమ్ఇవ్వని కేటీఆర్‌కు.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా గడవకముందే విమర్శలకు దిగడం, 420 హామీలు పేరుతో బుక్ రిలీజ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో రెండు గ్యారంటీలను అమలు చేసి, చరిత్ర సృష్టించామని, మిగిలిన వాటి అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు.
ప్రజాపాలనకు వస్తున్న స్పందనను చూసి కేటీఆర్ వెన్నులో వణుకు మొదలైందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కొత్త డ్రామాకు తెరలేపాడని విమర్శించారు. ఎన్ని డ్రామాలు ప్లే చేసినా బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఫలితాలే రిపీట్ కాబోతున్నాయని, 15 లోక్‌సభ స్థానాలు గెలిచి సోనియాగాంధీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ ఓటమి తప్పదు
లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్ఎస్ పగటి కలలు కంటోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బీఆర్ఎస్ను ఓడిస్తారని చెప్పారు. గురువారం భువనగిరిలో జరిగిన ప్రజాపాలనలో పాల్గొని మాట్లాడారు. పదేండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేసిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కరెక్ట్‌కాదన్నారు. ఆరు గ్యారంటీను జీర్ణించుకోలేక, కేటీఆర్పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.