హైదరాబాద్, వెలుగు: భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్‌ఆఫీస్, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ చెరువు శిఖం భూమిలోనే నిర్మించామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. దానిని ఆనుకునే వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించామని.. ఈ మూడు ఒకే సర్వే నంబర్లో ఉన్నాయని.. క్యాంప్‌ఆఫీస్, గెస్ట్‌హౌస్ లపై లేని అభ్యంతరం ఆలయంపైనే ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆలయ ఆవరణలో అర్చకుల వసతి కోసం నిర్మాణాలు చేస్తున్నామని, అది కమర్షియల్కాంప్లెక్స్ ఎంతమాత్రం కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఒక రౌడీ షీటర్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసి తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయించారని తెలిపారు. ఆలయం కడితే నోటీసులు ఇచ్చారని, వాటిపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలయం నిర్మించాం కాబట్టి తనపై అక్రమ కేసులు పెట్టించారని తెలిపారు. గుడిని ఆనుకుని ఆలయ అవసరాల కోసం కాంప్లెక్స్ కట్టామని, అది ఆలయం ఆస్తి తప్ప తన సొంత ఆస్తి కాదన్నారు.
ప్రభుత్వ భూమిలో గుడి కట్టామని.. రామాలయం కట్టిన భక్త రామదాసుకే కష్టాలు తప్పలేదు.. తనపై కేసు నమోదు చేశారు, జైలుకు పంపుతారేమో.. వెళ్తానని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెబితే పోలీసులు రూల్స్‌కు విరుద్ధంగా ఆ పని చేయడం సరికాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్‌పార్టీకి పార్లమెంట్ఎన్నికల్లో చేదు అనుభవం తప్పదని హెచ్చరించారు.