
- ఆయనకు సీటిస్తే ఓటమి తప్పదు
- ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యతిరేక వర్గం డిమాండ్
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు : రెండుసార్లు గెలిపించినం.. ఉద్యమకారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిండు.. మూడోసారి గెలిపించడానికి మనసు ఒప్పడం లేదు.. మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థిగా శంకర్ నాయక్ ను తప్పించి కొత్త అభ్యర్థిని ప్రకటించాలి”అని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసమ్మతి వర్గం నేతలు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో గురువారం మాజీ సర్పంచ్ సట్ల నర్సయ్య ఇంట్లో కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన ఉద్యమకారులు, ఎమ్మెల్యే అసమ్మతి వర్గం నేతలు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెండు సార్లు అష్ట కష్టాలకోర్చి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను గెలిపిస్తే ఉద్యమకారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. ఎన్నో సార్లు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినప్పటికీ ఒక్కనాడు కూడా తమ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వ పథకాలు ఏవీ అందకుండా చేశాడని ఆరోపించారు. పార్టీ కోసం కష్టించే కార్యకర్తలకు, ఉద్యమకారులకు అండగా నిలిచే వ్యక్తినే కొత్త ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని, శంకర్ నాయక్‌నే తిరిగి నిలిపితే ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ విషయమై త్వరలోనే ప్రగతిభవన్‌కు సైతం వెళ్తామని చెప్పారు.