ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

  • ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  

ఆత్మకూరు, వెలుగు: ఆత్మకూరు సర్పంచ్​గా తానే వ్యవహరిస్తానని, అభివృద్ధి పనులకు అడ్డువచ్చిన వారికి తగిన గుణపాఠం చెప్తానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరులో తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. ఎంపీడీవో ఆఫీసులో మాట్లాడుతూ.. మండల కేంద్ర అభివృద్ధికి  కొందరు అడ్డుపడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. కొద్దిరోజులుగా ఇక్కడ నెలకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పర్యటించినట్లు చెప్పారు. తానే స్వయంగా సర్పంచిగా వ్యవహరిస్తూ అభివృద్ధి చేస్తానన్నారు. రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోతున్నవారికి ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అంగన్​వాడీ కేంద్రాలను పరిశీలించి కేంద్రాలను పరిశీలించి రెండింటికి పక్కా భవనాలు మంజూరు చేశారు. పెద్ద  చెరువు నుంచి వచ్చే కాలువ అభివృద్ధి, సీసీ రోడ్లు, సొంత స్థలాల్లో ఇండ్లు నిర్మించుకునే 75 మందికి డబుల్​బెడ్​రూం ఇండ్లు మంజూరు చేశారు. ఆరోగ్య ఉపకేంద్రం, మహిళా భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

‘ఐనవోలు’ చైర్మన్ గిరిపై అంతర్గత పోరు!

హనుమకొండ, వెలుగు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ చైర్మన్ గిరిపై అంతర్గత పోరు నడుస్తోంది. రూల్స్​కు విరుద్ధంగా చైర్మన్ పదవిని అప్పగించేందుకు నియోజకవర్గ నేతలు పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆలయంలో హక్కుదారులకు ట్రస్టీ సభ్యులుగా అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా పేర్లు ఖరారు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనవరిలోనే మల్లన్న జాతర ప్రారంభం కానుండడంతో చైర్మన్ పదవిపై ఇప్పటికే అధికార పార్టీ లీడర్లు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పదవి కోసం అదే మండలానికి చెందిన ఓసీ, బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం రూల్స్​ ను పక్కన పెట్టి, ఆలయంలో హక్కుదారులుగా ఉన్న ఓ వ్యక్తి పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో చైర్మన్​ పదవిపై ఆశ పెట్టుకున్న మిగతా నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 14 మంది ట్రస్టీ సభ్యుల ఎంపికలో కూడా నిబంధనలు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐనవోలు లో అధికార పార్టీకి చెందిన  నాయకుడొకరు సోషల్​ మీడియాలో పెట్టిన పోస్ట్​ వైరల్ గా మారింది. పార్టీలో కీలకంగా పని చేసే నాయకులను నియోజకవర్గ నేతలు గుర్తించడం లేదని, గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. బానిసత్వ రాజకీయాలతో కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని, క్షేత్రస్థాయిలో కష్టపడే నాయకులను గుర్తించాలని డిమాండ్​ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ చైర్మన్​ పదవిని అనర్హులకు కాకుండా రూల్స్​ ప్రకారం అర్హులైన వారికే అప్పగించాలనే డిమాండ్​ వ్యక్తమవుతోంది. దీనిపై నియోజకవర్గ నేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

బీజేపీతోనే బతుకులు  బాగు

హనుమకొండ సిటీ, వెలుగు: బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బీజేపీ నేత, న్యాయవాది భూక్య అరుణ్​ కుమార్​ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన నాయకులు మట్ల విష్ణు, రజనీకాంత్, సుశాంత్, ప్రశాంత్ సహా దాదాపు 200మంది యువకులు రావు పద్మ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రావు పద్మ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అభివృద్ధిపై పట్టింపు కరువు..

ములుగు, వెలుగు: ములుగు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సీతక్కకు పట్టింపు కరువైందని, కేవలం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజ్మీర కృష్ణవేణి నాయక్ ఆరోపించారు. శుక్రవారం ములుగులో బీజేపీ నాయకులతో సమావేశం అయ్యారు. అభివృద్ధిలో ఎమ్మెల్యే పాత్ర శూన్యమని ఆరోపించారు. నేటికీ గ్రామాలకు రోడ్లు, మంచి నీళ్లు లేవన్నారు. అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బర్త్ డే సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు.

రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..

వెంకటాపూర్(రామప్ప): రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప ఆలయ పరిసరాల్లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు బూత్ కమిటీ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పాదయాత్రలతో దండయాత్రలా? 

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ, పెంపుడు పార్టీల నేతలు పాదయాత్రల పేరుతో గ్రామాలపై దండయాత్రలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‍ విప్‍ దాస్యం వినయ్‍భాస్కర్‍ విమర్శించారు. దీక్షా దివస్‍ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శుక్రవారం హన్మకొండ పబ్లిక్‍ గార్డెన్‍ టౌన్‍హాల్‍లో ఫోటో ఎగ్జిబిషన్‍ నిర్వహించారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‍ ఆయాచితం శ్రీధర్‍, వినయ్‍భాస్కర్‍ దీనిని ప్రారంభించి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఉద్యమ ఫోటోలను తిలకించారు.  వినయ్‍భాస్కర్‍ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలోని ఫోటోలు చూస్తుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‍ ఖమ్మం జైల్‍లో చేపట్టిన దీక్ష గుర్తొస్తోందన్నారు. 

అందరి సహకారంతోనే విధుల్లో రాణించా..

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో పోలీస్ ఆఫీసర్లు, సిబ్బంది సహకారంతోనే విధుల్లో రాణించానని సీపీ డా.తరుణ్​జోషి అన్నారు. బదిలీలో భాగంగా డీజీపీ ఆఫీస్​కు వెళ్తున్న ఆయనకు.. ఆర్మ్​డ్​రిజర్వ్ విభాగం పోలీసులు.. శుక్రవారం వీడ్కోలు పరేడ్ నిర్వహించారు. ఆర్మ్​డ్ రిజర్వ్, సివిల్, ట్రాఫిక్, హోంగార్డ్ పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. అనంతరం తరుణ్​ జోషిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలు నియంత్రణలో భాగంగా బందోబస్తులు, లాక్ డౌన్ సమయంలో ఏఆర్​ విభాగం పోలీసులకు అప్పగించిన విధులు విజయవంతంగా నిర్వహించారన్నారు. ఈ ఏడాది జరిగిన మేడారం జాతరలో ట్రాఫిక్ ఇన్​ఛార్జిగా  విధులు నిర్వహించడం మధురస్మృతిగా నిలిచిపోతుందన్నారు. అనంతరం ఆయనను పూలతో  అలంకరించిన ప్రత్యేక జీపులో ఎక్కించి, డీసీపీ స్థాయి నుంచి హోంగార్డు వరకు అందరూ జీపును తాడుతో లాగి తమ అభిమానాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో  డీసీపీలు వెంకటలక్ష్మి, సీతా రం, అడిషనల్​ డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్ప, సంజీవ్, సురేశ్​కుమార్​,  ఏసీపీలు, ఆర్ఐలు, సీఐలు,  ఆర్ఎస్సైలు,  ఎస్సైలు,  పాల్గొన్నారు.

మోడల్ పీఎస్ పనులు త్వరగా పూర్తి చేయాలి

ములుగు, వెలుగు: ములుగులో జిల్లాకేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం ఓఎస్డీ గౌస్ ఆలం, ఏఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తో కలిసి పనుల్ని పరిశీలించారు. ప్రహరీ, పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్ సమీపంలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలన్నారు. కాగా, తమకు ఎలాంటి ఆధారం లేదని బాధితులు తెలపగా.. బండారుపల్లిలోని ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కొత్త కలెక్టరేట్ కన్ స్ట్రక్షన్ మ్యాప్ ను చూశారు. పనులు వెంటనే మొదలుపెట్టాలని ఇంజినీరింగ్ ఆఫీసర్లకు సూచించారు. ములుగులోని బండారుపల్లి క్రాస్​రోడ్డు నుంచి నర్సాపూర్​వరకు ఫోర్ లేన్ రోడ్డు, నర్సాపూర్ నుంచి పాలంపేట వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వారివెంట సీఐ ఎం.రంజిత్ కుమార్, ఎస్సై ఓంకార్ యాదవ్ తదితరులున్నారు.