జవహర్​నగర్ మున్సిపల్​ ఆఫీసర్లు ఫెయిల్.. చామకూర మల్లారెడ్డి

జవహర్ నగర్, వెలుగు: జవహర్​నగర్​లో పాలన అస్తవ్యస్తంగా మారిందని, వీధికుక్కల స్వైర విహారాన్ని అరికట్టడంలో మున్సిపల్​ఆఫీసర్లు ఫెయిల్​అయ్యారని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మండిపడ్డారు. కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. మంగళవారం రాత్రి జవహర్ నగర్ లో కుక్కల దాడిలో చనిపోయిన బాలుడు విహాన్ తల్లిదండ్రులకు మల్లారెడ్డి గురువారం వీడియో కాల్​చేసి మాట్లాడారు.

అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప.. కొత్తగా కాంగ్రెస్​చేసిందేమీ లేదన్నారు. జవహర్ నగర్​లోని రోడ్లు, కూడళ్లు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త పారబోయకుండా చూడాలని మున్సిపల్​అధికారులకు సూచించారు.

కుక్కల దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సమక్షంలో మాజీ మేయర్ మేకల కావ్య రూ.20వేలు, కార్పొరేటర్ నిహారికగౌడ్ రూ.10 వేలు అందజేశారు. కార్పొరేటర్లు జిట్ట శ్రీవాణి, సంగీత తదితరులు పాల్గొన్నారు.