వేములవాడలో చల్మెడ పాగా..హైకమాండ్​ హామీతో దూకుడు పెంచిన లక్ష్మీనర్సింహారావు

వేములవాడ, వెలుగు:   బీఆర్‌‌ఎస్​ హైకమాండ్‌కు ఎమ్మెల్యే రమేశ్​బాబు పౌరసత్వ వివాదం తలనొప్పిగా మారడంతో ఈసారి ఆయనకు టికెట్​ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్​ నుంచి  చల్మెడ లక్ష్మీ నరసింహారావు కు వేములవాడ టికెట్​ ఖాయం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టికెట్ హామీతోనే చల్మెడను కేటీఆర్​ పార్టీలోకి తీసుకువచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే చల్మెడ వేములవాడలో పర్యటిస్తూ క్యాడర్​కు దగ్గరవుతున్నారు. తాజాగా వేములవాడలో మంగళవారం క్యాంప్​ ఆఫీసు ప్రారంభించడం బీఆర్ఎస్​లో హాట్​టాపిక్​గా మారింది.

దూకుడు పెంచిన చల్మెడ 

ప్రస్తుత ఎమ్మెల్యే రమేశ్​బాబుపై ఉన్న పౌరసత్వ వివాదం బీఆర్ఎస్​హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ పెద్దలు నిర్వహించిన సర్వేల్లో, ఇంటెలిజెన్స్​ నుంచి తెప్పించుకున్న నివేదికల్లోనూ ఎమ్మెల్యేపై జనాల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలిసింది.  ఏడాదిలో ఎక్కువ కాలం జర్మనీలో ఉండడం కూడా ఆయనకు మైనస్‌గా మారింది. గతంలో సీఎం కేసీఆర్​రెండుసార్లు వేములవాడకు వచ్చిన సందర్భంలోనూ రమేశ్​బాబు జర్మనీలో ఉండడంపై ఆయన ఆగ్రహించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్​, కేటీఆర్​  చల్మెడ లక్ష్మీనరసింహరావును ఏడాది కింద బీఆర్ఎస్​పార్టీలోకి చేర్చుకున్నారు. 

వేములవాడ టికెట్​హామీతో పార్టీలో చేరిన చల్మెడ నియోజకవర్గంపై కొంతకాలంగా పట్టు పెంచుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. క్యాడర్​ను కూడా కూడగడ్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్తున్న నేపథ్యంలో మరింత దూకుడు పెంచారు. ఇందులో భాగంగా మంగళవారం వేములవాడలో క్యాంపు ఆఫీసు ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, అందుకోసమే క్యాంపు ఆఫీసు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. పార్టీ హైకమాండ్ హామీతోనే చల్మెడ నియోజకవర్గంలో పాగా వేశారనే ప్రచారం జరుగుతోంది. 

చల్మెడను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే యత్నాలు 

నియోజకవర్గంలో చల్మెడ కార్యకలాపాలపై ఎమ్మెల్యే రమేశ్‌బాబు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇటీవల పలు వేదికల మీద చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌ను ఉద్దేశించి ఆయనకు కొందరు తప్పుడు సలహాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. కొందరు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సైతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఇటీవల చల్మెడ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటో పెట్టినందుకు ఎమ్మెల్యే బీఆర్ఎస్​ కార్యకర్తలను పోలీసులతో బెదిరించారన్న చర్చ జరిగింది. వేములవాడలో వివిధ ఉత్సవాల సందర్భంగా చల్మెడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఎమ్మెల్యే ఒత్తిడితో మున్సిపాలిటీ సిబ్బంది తొలగించినట్లు తెలుస్తోంది. 

ఇంటి పోరు ఎక్కువైంది

ఎమ్మెల్యే రమేశ్‌బాబు తీరుతో తమకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ రెడ్డి సామాజికవర్గం నేతలు అసంతృప్తితో ఉన్నారు.  2018లో టికెట్‌ ఆశించిన పార్టీ నేత ఏనుగు మనోహర్‌‌రెడ్డి ఈసారి తనకు పోటీ వస్తారన్న అనుమానంతో ఎమ్మెల్యే దూరం పెట్టారు. దీంతో మనోహర్​రెడ్డి సైతం ఎమ్మెల్యేకు కౌంటర్​గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు కూడా మనోహర్‌‌రెడ్డికి ఆహ్వానం పంపలేదు. ఆయనకు అధికారులు సహకరించొద్దని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుంచి ఆదేశాలు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జడ్పీ చైర్‌‌పర్సన్​ను కూడా గతంలో ఓ సారి ఎమ్మెల్యే బాబు మందలించినట్లు  తెలుస్తోంది. మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి కూడా నియోజకవర్గ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మనోహర్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​, లోక బాపురెడ్డి.. మంత్రి కేటీఆర్ ను కలిసి వేములవాడలో పరిణామాలను వివరించినట్లు తెలిసింది. 

ప్రజలకు సేవ చేసేందుకే  క్యాంపు ఆఫీసు 

వేములవాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే క్యాంపు ఆఫీస్​ఓపెన్​చేశానని బీఆర్ఎస్​లీడర్​చల్మెడ లక్ష్మీ నరసింహరావు అన్నారు. మంగళవారం వేములవాడలోని మల్లారం బైపాస్​ రోడ్​లో చల్మెడ తన క్యాంపు ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన క్యాంపు ఆఫీసు ఓపెనింగ్ అనేది వ్యక్తిగతమన్నారు. అయితే అభిమానంతో భారీ సంఖ్యలో బీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలు హాజరైనట్లు చెప్పారు. హైకమాండ్​ఆదేశిస్తే వేములవాడ ప్రజలకు సేవచేసేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చల్మెడ ప్రకటించారు.  ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. క్యాంపు ఆఫీస్​ఓపెనింగ్‌కు మార్కెట్ కమిటీ చైర్మన్ మిర్యాల ప్రభాకర్ రావు, కథలపూర్​మండలాధ్యక్షుడు గంగప్రసాద్, సింగిల్​విండో చైర్మలను నర్సయ్య యాదవ్, కిషన్ రావు, రాంమోహన్​ రావు, జడ్పీ మాజీ చైర్ పర్సన్​ రవీందర్ గౌడ్, మున్సిపల్​ కౌన్సిలర్ విజయ్, లీడర్లు అబ్రహం, గజనంద రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.