సంగారెడ్డి టౌన్, వెలుగు: కాంగ్రెస్పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ లోని గచ్చిబౌలి పీఎస్లో మాజీ మంత్రి హరీశ్ రావుని ఆయన, ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ కవిత, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ప్రజాక్షేత్రంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. పోలీసులు పనితీరు మార్చుకోవాలని కాంగ్రెస్ నేతలకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిందని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి శాశ్వతం కాదని ఆయన పతనం మొదలైందని వెయ్యి మంది రేవంత్ రెడ్డిలు ఒకటైన బీఆర్ఎస్ ను ఏమీ చేయలేరని హెచ్చరించారు.
సిద్దిపేట రూరల్ :ప్రశ్నించే గొంతులను నొక్కడమే కాంగ్రెస్ ఎజెండా అని బీఆర్ఎస్నాయకులు అన్నారు. గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫోన్ టాపింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పైనే ఉల్టా కేసు పెట్టడం దారుణమన్నారు. కార్యక్రమంలో పాల సాయిరాం, రాజనర్సు, వేణుగోపాల్ రెడ్డి, సంపత్ రెడ్డి, శ్రీనివాస్, చందర్ రావు పాల్గొన్నారు.
పాపన్నపేట: ప్రభుత్వం బీఆర్ఎస్నాయకులపై కుట్రలు మానుకోవాలని మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. ఏడుపాయల వద్ద ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే హరీశ్ రావు, బీఆర్ఎస్నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా విజయోత్సవాలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు ఆంజనేయులు, జగన్, బాలాగౌడ్, వెంకట్ రెడ్డి, కిష్టయ్య ఉన్నారు.