ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నకిరేకల్,  వెలుగు: కాంగ్రెస్, బీజేపీ లీడర్లు అధికార దాహంతో టీఆర్ఎస్​నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ ప్రజలకు దూరమవుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్, కట్టంగూర్,  కేతేపల్లి మండలాల్లో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో కాంగ్రెస్​, బీజేపీ  కార్యకర్తుల ఎమ్మెల్యే సమక్షంలో  టీఆర్ఎస్​లో చేరారు. అనంతరం మాట్లాడుతూ పనిచేసే లీడర్లను ప్రజలు దీవించాలని,  పనిచేయని వాళ్లను బరాబర్​నిలదీయాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, స్వర్ణలత,  మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి  టీఆర్ఎస్ ​లీడర్లు పాల్గొన్నారు. 

టీఆర్ఎస్​ ప్రభుత్వానికి మద్దతివ్వాలి

మిర్యాలగూడ, వెలుగు: పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్​కు నియోజకవర్గ ప్రజలు ఎల్లవేళలా మద్దతివ్వాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావు కోరారు.  ఆదివారం నియోజకవర్గంలో రూ. 9.6 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్లు, రూ. 55 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మున్సిపల్​ చైర్మన్​ తిరునగర్ భార్గవ్​తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్లాన్​ ప్రకారం.. ముందుకు సాగుతామని చెప్పారు. ఎన్నికలకు ముందే నియోజకవర్గంలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. డీఈ విజయలక్ష్మి, కౌన్సిలర్లు మల్గం రమేశ్​, ఉదయ భాస్కర్​, కర్నె ఇందిరమ్మ, నిరంజన్​రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి,  పత్తిపాటి నవాబ్ తదితరులు 
పాల్గొన్నారు.

కేసీఆర్​ను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర:డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు: కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే కేసీఆర్ కుటుంబ సభ్యులపై కేంద్రం ఈడీ, ఐటీ, సీబీఐ దర్యాప్తు సంస్థలతో దాడులు చే స్తూ భయపెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. యాదగిరిగుట్ట మండలం మహబూబ్ పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం యాదగిరిగుట్టలో మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి  ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసిన దేశప్రజలు.. దేశాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్   గొప్పగా అభివృద్ధి చేశారని పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు మాట్లాడుతుంటే.. స్టేట్​బీజేపీ లీడర్లు అందుకు విరుద్ధంగా మాట్లాడడం అవివేకమన్నారు. ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్,  జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మిట్ట వెంకటయ్య, ఆరె స్వరూప తదితరులు ఉన్నారు. 

‘ఆటోనగర్’ హామీ విస్మరించిన మంత్రి :టీపీసీసీ సెక్రటరీ పటేల్​ రమేశ్​రెడ్డి

సూర్యాపేట, వెలుగు:   జిల్లా కేంద్రంలో వివిధ రంగాల కార్మికులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా అనువైన ఆటోనగర్  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి జగదీశ్​రెడ్డి  ఏండ్లు గడుస్తున్నా నెరవేర్చడం లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేశ్​రెడ్డి విమర్శించారు.  ‘వార్డు వార్డుకు కాంగ్రెస్’ పాదయాత్రలో భాగంగా ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారపార్టీ లీడర్లు కబ్జాచేసిన భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు. అక్రమాలకు వేదికగా మారిన ‘ధరణి’ని  రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్​రైతులకు సీఎం కేసీఆర్ అందజేసిన చెక్కులు బౌన్స్ కావడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇచ్చిన నోటీసులపై సీఎం ప్రజలకు సమాధానం చెప్పాలని రమేశ్​రెడ్డి డిమాండ్​చేశారు. 


కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ


హుజూర్ నగర్, వెలుగు:  రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశంలోనే ఆదర్శపథకాలయ్యాయని హుజూర్​నగర్​ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. చింతలపాలెం మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఆయన ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో  కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, దొంతగాని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

అభాగ్యులకు ఆసరా సీఎం రిలీఫ్​ఫండ్​

దేవరకొండ, వెలుగు: సీఎం రిలీఫ్​ఫండ్​అభాగ్యులకు ఆసరా అవుతోందని ఎమ్మెల్యే రవీంద్రకుమార్​ చెప్పారు. ఆదివారం దేవరకొండ పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ఆయన నియోజకవర్గానికి చెందిన 66 మందికి సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కులను పంపిణీ చేశారు. హన్మంతు వెంకటేశ్​గౌడ్, రహ్మత్​అలీ తదితరులు పాల్గొన్నారు. 

టీఆర్ఎస్​ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం:బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వరరావు 

సూర్యాపేట, వెలుగు: టీఆర్ఎస్​పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం ఆత్మకూరు(ఎస్) మండలంలోని పాతర్లపాడు గ్రామంలో ఇటీవల చనిపోయిన  బీజేపీ కార్యకర్తలు జటంగి మల్సూరమ్మ, పెనుగొండ నిర్మల,  గుంటూరు రాజారావు  కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా సంకినేని మాట్లాడుతూ తెలంగాణలో పుట్టబోయే ప్రతి బిడ్డ పై రూ. లక్ష కు పైగా అప్పు ఉందన్నారు. భవిష్యత్​తరాలకు  ప్రభుత్వ భూమి లేకుండా కేసీఆర్​ కుటుంబం అమ్ముకుంటోందని విమర్శించారు.   కేసీఆర్​ లక్షల కోట్లు వెనకేసుకుంటే, మంత్రి జగదీశ్​రెడ్డి వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు.  వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంకినేని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి,  వీరస్వామి పాల్గొన్నారు. 

ఎనిమిదేండ్లలో నల్గొండ అభివృద్ధి నిల్: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్

నల్గొండ అర్బన్​, వెలుగు:  ఎనిమిదేళ్ల టీఆర్ఎస్​పాలనలో నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని బీజేపీ రాష్ర్ట కార్యదర్శి మాదగోని శ్రీనివాస్​గౌడ్​విమర్శించారు. ఆదివారం బీజేపీ జిల్లా ఆఫీస్​లో ఆయన ప్రెస్​మీట్​లో మాట్లాడారు. సీఎం కేసీఆర్​రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. ‘ధరణి’ తో ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని, వివిధ ప్రాంతాల్లో ఉన్నవారి భూములను కేసీఆర్​ కుటుంబం లాక్కుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా, భూపాల్ రెడ్డి  గెలిచి నాలుగేండ్లవుతున్నా.. నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు.  నియంత పాలనను ఎండగట్టేందుకు ఈ నెల 9నుంచి 15వరకు నియోజకవర్గంలో ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ బైక్ యాత్ర నిర్వహిస్తోందని, బీజేపీ శ్రేణులు సక్సెస్​చేయాలని శ్రీనివాస్​గౌడ్​పిలుపునిచ్చారు.  బీజేపీ రాష్ట్ర నాయకుడు, బైక్ యాత్ర ప్రముఖ్ వీరెల్లి చంద్రశేఖర్, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, లీడర్లు నూకల వెంకట్ నారాయణ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్ ​అధికారంలోకి వస్తే ‘ధరణి’ రద్దు:టీపీసీసీ మెంబర్​ దుబ్బాక నర్సింహారెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: రైతు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ మెంబర్​దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  క్యాంపు ఆఫీస్​లో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, కాంగ్రెస్​పార్టీ నకిరేకల్​నియోజకవర్గ ఇన్​చార్జి కొండేటి మల్లయ్యతో ప్రెస్​మీట్​లో మాట్లాడారు. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్​ను రద్దు చేసి, పోడు భూములకు పట్టాలిస్తామన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. కౌలు రైతులకు రైతుబంధు, బీమా అమలు చేయాలని డిమాండ్​చేశారు. రైతుల సమస్యల కోసం ఈ నెల 5న కలెక్టరేట్​ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే ధర్నాను సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేశ్,  కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.