- వధూవరుల సంప్రదాయం ప్రకారమే వివాహాలు
- పెట్టిపోతలతో ఇంటికి సాగనంపిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దంపతులు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పెళ్లంటే నూరేళ్ల పంట..! ఒక్క జంట ఏకమైతేనే ఊరంతా సందడి ఉంటుంది. మరి ఒకేసారి 220 జంటలు ఒక్కటైతే..? కనుల పండువగా సాగిన ఈ వేడుకకు ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్ వేదికైంది. ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,జమున దంపతులు పెళ్లి పెద్దలయ్యారు. వధూవరుల మతం, సంప్రదాయం ప్రకారం నిర్వహించిన సామూహిక వివాహాలకు వేల మంది బంధువులతో పాటు... ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్‌పర్సన్ శాంతి కుమారి, కలెక్టర్ ఉదయ్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి హాజరై కొత్త జంటలను ఆశీర్వదించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. ముందుగానే పట్టువస్ర్తాలు, పుస్తెమెట్టెలు ఇచ్చిన ఎమ్మెల్యే పెళ్లి తర్వాత బీరువా, మంచం, బెడ్, దిండ్లు, ట్రావెలింగ్ బ్యాగ్, ఫ్యాన్, మిక్సి, కుక్కర్, ఇతర వంట సామాగ్రి అందించి ట్రాక్టర్లలో వారి ఇళ్లకు సాగనంపారు. ఈ సందర్భంగా బరాత్ నిర్వహించగా బంధువులు, బీఆర్‌ఎస్ నేతలు డాన్సులు చేశారు.
ప్రతి జంటకు రూ.2 లక్షలు సామాగ్రి
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి జంటకు రూ.2 లక్షల విలువైన సామగ్రి అందించామని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తన తండ్రి జంగారెడ్డి పేరిట ట్రస్ట్ స్థాపించి పేదరికంలో ఉన్న ఆడబిడ్డల పెళ్లిళ్లు చేస్తున్నానన్నారు. ఇప్పటివరకు 485 జంటలకు వివాహాలు జరిపించినట్లు వివరించారు. ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, భేతి సుభాష్ రెడ్డి మర్రి సేవలను అభినందించారు. ఒకేసారి 220 జంటలకు మందికి తన సొంతవాళ్లలా వైభవంగా పెళ్లిళ్లు చేయడం ప్రశంసనీయమని కొనియాడారు.