ఖైరతాబాద్​లో ఆక్రమణల కూల్చివేతలను అడ్డుకున్న దానం

ఖైరతాబాద్​లో ఆక్రమణల కూల్చివేతలను అడ్డుకున్న దానం
  • దావోస్ నుంచి సీఎం వచ్చేదాకా ఆపాలని హల్​చల్
  • జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం
  • కూల్చివేతలు ఆపొద్దంటూ బీజేపీ నేతల నిరసన.. ఉద్రిక్తత

హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్​లోని ఖైరతాబాద్ డివిజన్ లో ఉన్న ఫుట్​పాత్​లపై ఆక్రమణల తొలగింపులు ఉద్రిక్తతకు దారితీసింది. కూల్చివేతలు ఆపాలంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్​ అధికారులను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి వచ్చేదాకా కూల్చివేతలు ఆపాలన్నారు. అంతలోనే బీజేపీ నేతలు అక్కడికి చేరుకుని ఆక్రమణలు కూల్చాల్సిందే అంటూ నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అన్ని వర్గాలను సమానంగా చూడాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని.. ఇద్దరు ఎమ్మెల్యేలను సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. 

తర్వాత జీహెచ్​ఎంసీ అధికారులు యథావిధిగా కూల్చివేతలు కొనసాగించారు. ‘ఆపరేషన్ రోప్’లో భాగంగా మంగళవారం రాత్రి ఖైరతాబాద్ డివిజన్ లోని మెట్రో పిల్లర్ ఏ1185 నుంచి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు కూల్చివేతలు ప్రారంభించారు. బుధవారం కూడా ఖైరతాబాద్ డివిజన్​లోని షాదాన్ కాలేజీ నుంచి చింతలబస్తీలోని చేపల మార్కెట్​వరకు ఫుట్​పాత్ ఆక్రమణలు, షెడ్లను జేసీబీలతో కూల్చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. జీహెచ్​ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు ఆపాలని ఆదేశించారు.

నాకు తెలియకుండా కూలుస్తారా?: దానం

తాను ఖైరతాబాద్ సెగ్మెంట్ ఎమ్మెల్యే అని, తనకు తెలియకుండా ఎలా కూల్చివేతలు చేపడ్తారని అధికారులను దానం నాగేందర్ ప్రశ్నించారు. ‘‘మీరు కూల్చివేతలు ఆపండి.. లేకుంటే బండి ముంగట కూసుంటా.. ఇలాంటి ఆక్రమణలు ఎన్నో ఉన్నాయి. పెద్ద.. పెద్ద కాంప్లెక్సులున్నాయి. నేను చూపిస్తా.. ముందు వాటిని కూల్చండి. తర్వాత వీటి సంగతి చూద్దాం. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలి. అయినా.. మీరు వినకపోతే, నా ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదు.. ఇక్కడే కూర్చుంటా. తర్వాత లా అండ్ ఆర్డర్ 
సమస్య వస్తది’’అని హెచ్చరించారు.

కూల్చాల్సిందే అని పట్టుబట్టిన బీజేపీ 

కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం, ఎంఐఎం ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ కూల్చివేతలను అడ్డుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అందరికీ సమన్యాయం పాటించాలని డిమాండ్ చేశారు.