స్మితా సబర్వాల్ వాస్తవాన్నే రీట్వీట్ చేశారు : ఎమ్మెల్యే దానం నాగేందర్

స్మితా సబర్వాల్ వాస్తవాన్నే రీట్వీట్ చేశారు : ఎమ్మెల్యే దానం నాగేందర్

బషీర్​బాగ్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్​స్మితా సబర్వాల్ వాస్తవాన్నే రీట్వీట్ చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు తాము భావించడం లేదన్నారు. హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దానం పాల్గొని మాట్లాడారు. 

కంచ గచ్చిబౌలి విషయంలో రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీం కోర్టు సీరియస్ అవ్వడం బాధించిందన్నారు. ఆమెకు మంచి అధికారిగా పేరు ఉందని.. కోర్టు చివాట్లతో చెడ్డ పేరు వచ్చిందన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ను ప్రజలు చూడాలనుకుంటున్నారని.. 27న వరంగల్​సభకు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పారు. అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులు ఉండే ప్రాంతాల్లోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.