నిజామాబాద్ సిటీ, వెలుగు: పట్టణంలోని 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్ యూపీఎస్ పాఠశాల, బస్తీ దావాఖానను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యూపీఎస్ లో ఆరుగురు ఉపాధ్యాయులు, మౌలిక సౌకర్యాలు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య 40 మాత్రమే ఉందన్నారు. విద్యా సంవత్సరం మొదలై ఏడు నెలలు పూర్తి కావస్తున్నా మిర్చి కాంపౌండ్ లోని యూపీఎస్, ఉర్దూ పాఠశాలలోసరిగా బోధన జరగడం లేదని మండిపడ్డారు. ఉర్దూ స్కూల్లో ఉపాధ్యాయురాలు నాలుగు రోజుల నుంచి రావడం లేదని, బదులుగా వేరే టీచర్ ని పంపుతున్నారని, పాఠశాలకు రాని విద్యార్థులు వచ్చినట్లు రిజిస్టర్ లో నమోదు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారితో వెంటనే మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్తీ దావాఖానలో సకల వసతులు ఉన్నప్పటికీ డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలకు వైద్యం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులపై నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య అధికారికి సూచించారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ ను సందర్శించారు. కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటర్ కల్పన మల్లేశ్ గుప్తా, డివిజన్ బీజేపీ నాయకులు పవన్ ముందడ, బంటు ప్రవీణ్, తారక్ వేణు, వనిత, సురేశ్ నాయకులు పాల్గొన్నారు.