నిజామాబాద్ సిటీ, వెలుగు: ప్రజలకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు చిత్తశుద్ధితో పని చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బస్తీ దవాఖానాల తీరుపైన ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్స్, సిబ్బంది ఉన్నప్పటికీ దవాఖానకు వచ్చే రోగులను పట్టించుకోవడం లేదన్నారు. మందులు ఇవ్వకుండా రికార్డులో మాత్రం లెక్కలు అధికంగా ఉండటం పై మండిపడ్డారు. పేదలకు అందాల్సిన వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వైద్య శాఖ అధికారి రాజశ్రీ, డీఎస్‌ఓ డాక్టర్ నాగరాజు, ప్రోగ్రాం ఆఫీసర్ డా. రాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఖేలో భారత్ ఉత్సవాలు ప్రారంభం
నిజామాబాద్ సిటీ, వెలుగు: స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ మహనీయుల జయంతి సందర్బంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో జీజీ కళాశాల మైదానంలో ఖేలో భారత్ ఉత్సవాలను శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దేశభక్తి, శారీరక,మానసిక దృఢత్వం పెంపొందించే విధంగా మహనీయుల జయంతి సందర్బంగా ఖేలో భారత్ పేరు తో విద్యార్థి పరిషత్ క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏబీవీపీ ఇందూర్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్, విభాగ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాజ్ సాగర్, విభాగ్ కన్వీనర్ నర్ శశి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.