కేసీఆర్ సింగరేణిలో ..23 వేల ఉద్యోగాలు తొలిగించిండు : వివేక్​ వెంటకస్వామి

  • చెన్నూరులో అభివృద్ధి అంశాలపై రివ్యూ 

కోల్​బెల్ట్/చెన్నూరు/జైపూర్, వెలుగు : తెలంగాణ వచ్చిన టైంలో సింగరేణిలో 62 వేల మంది కార్మికులు ఉంటే ఇప్పుడు 39 వేలకు తగ్గారని.. కేసీఆర్​ సీఎం అయ్యాక 23వేల ఉద్యోగాలను తొలిగించాడని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​ జి.వివేక్​వెంకటస్వామి విమర్శించారు. మంగళవారం ఐఎన్టీయూసీ, కాంగ్రెస్​ లీడర్లతో కలిసి ఆయన మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లు, జైపూర్​లోని సింగరేణి పవర్ ​ప్లాంట్ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ రూ.వేల కోట్ల లాభాల్లో ఉందని అంతా అనుకుంటున్నారని, కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయన్నారు.

బీఆర్ఎస్​ సర్కార్, టీబీజీకేఎస్​ కారణంగా సంస్థ అప్పులపాలైందని ఆరోపించారు. నిధుల్లేకపోవడంతో కొత్త గనులు తవ్వలేకపోయారని, కనీసం కొత్త క్వార్టర్లు కూడా నిర్మించలేని దుస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. కార్మికుల హక్కుల కోసం పోరాడే ఐఎన్టీయూసీని ఆదరించి గెలిపించాలని కోరారు. కాకా వెంకటస్వామి చొరవతోనే జైపూర్​లో 1200 మెగావాట్ల థర్మల్​ పవర్​ ప్లాంట్​ ఏర్పాటైందన్నారు. ఈ సందర్భంగా జైపూర్ ​పవర్​ప్లాంట్​కు చెందిన పలువురు టీబీజీకేఎస్​ లీడర్లు పలువురు వివేక్​ వెంకటస్వామి సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరారు.

కార్యక్రమంలో ఐఎన్టీయూసీ లీడర్లు కాంపెల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్, మండ భాస్కర్,  మిట్ట సూర్యనారాయణ, వెంకటస్వామి, శంకర్​రావు, సత్యనారాయణ, రాకేశ్, రాజు, కాంగ్రెస్​ లీడర్లు చల్లా సత్యనారాయణ రెడ్డి, ఫయాజ్,​ విశ్వంబర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గడ్డం రజిత పాల్గొన్నారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ

చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం జనగామ గ్రామంలో ఇటీవల మృతి చెందిన తలేండి పోసక్క, నర్సయ్య, తెర్రం లక్ష్మయ్య కుటుంబాలను ఎమ్మెల్యే వివేక్​ పరామర్శించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, హేమమంత రెడ్డి, బాపురెడ్డి, పోటు రామిరెడ్డి, రఘునందన్ రెడ్డి, మాదంరవి కళావతి, మహేశ్ తివారి, కురుమ రాజమల్లగౌడ్, సర్పంచ్​లు, ఎంపీటీసీలు ఉన్నారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల విషయంలో అలసత్వం వహించొద్దని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అధికారులను హెచ్చరించారు. చెన్నూరు నియోజకవర్గం కేంద్రంలోని ఫారెస్ట్​ఆఫీస్​లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. కాంగ్రెస్ ​ప్రభుత్వం ఏర్పడి 23 రోజులైనా నియోజకవర్గం ఆఫీసర్లు తన దృష్టికి ఎలాంటి సమస్యలను తీసుకురాలేదన్నారు.

ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్జీలను పెండింగ్​లో పెట్టకుండ పరిష్కరించాలన్నారు. రివ్యూ మీటింగ్​లో డీఆర్​డీవో శేషాద్రి, వెటర్నరీ జేడీ రమేశ్, ఎఫ్​డీవో రమేశ్, ఎమ్మార్వోలు ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.