- ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి, వెలుగు : గత ప్రభుత్వ హయాంలోమున్సిపాలిటీ అవినీతి మయంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి హెచ్చరించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి మున్సిపల్ కమిషనర్, అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అభివృద్ధి, అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 23 వార్డుల్లో పూర్తి స్థాయిలో త్వరగా డ్రైనేజీ క్లీనింగ్, వీధిలైట్లు, ఇతర శానిటేషన్ పనులు చేయాలని సూచించారు. పట్టణంలో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు అధిక పని ఒత్తిడితో సతమతవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డివిజన్ పరిధిలోని ఏఈవోలు వినతి పత్రం అందజేశారు.