సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి : మట్టా రాగమయి

సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి  :  మట్టా రాగమయి
  • ఎమ్మెల్యే మట్టా రాగమయి 

సత్తుపల్లి, వెలుగు  :  సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్​మట్టా రాగమయి అన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ. 200 కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ మంజూరైనట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి రెసిడెన్సియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయనున్నారని, రాష్ట్రంలో మొత్తం 55 పాఠశాలలు మంజూరు కాగా అందులో సత్తుపల్లికి ఒకటి కేటాయించారని వెల్లడించారు. కల్లూరుగూడెంలో రూ.2.40కోట్లతో పామాయిల్ కర్మాగారం మంజూరైందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. 

యాతాలకుంటలో సీతారామ టన్నెల్ కు భూములు ఇచ్చిన రైతులకు రూ.15కోట్లు మంజూరు చేసి అందించినట్లు చెప్పారు. రేజర్లలో ఓసీ విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు రూ.2కోట్లు అందించేలా కృషి చేశామన్నారు. ఇంకా  15 నెలల పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కిష్టారం శైలో బంకర్ బాధితుల సమస్యను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే వారి సమస్య కూడా పరిష్కారమవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్లు దోమ ఆనంద్ బాబు, నీరజ, కాంగ్రెస్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, గాదే చెన్నకేశవరావు, కమల్ పాష దూదిపాల రాంబాబు, తోట సుజలరాణి తదితరులు పాల్గొన్నారు.