జగిత్యాల టౌన్, వెలుగు: ఎక్కడా లేని విధంగా జగిత్యాల నియోజకవర్గానికి తాను 4500 డబుల్బెడ్రూం ఇండ్లు తీసుకొచ్చానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొనగా.. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేయనంత అభివృద్ధిని సీఎం సాయంతో తన హయాంలో చేసినట్లు చెప్పారు. జగిత్యాలను జిల్లా కేంద్రం చేయడంతోపాటు అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.4 వేల కోట్లు వెచ్చించామన్నారు.
బీర్పూర్మండల ఏర్పాటుతో పాటు, కొత్తగా 19 గ్రామాలను జీపీలుగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ, 650 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.