గెలవరు అనే భయంతోనే టీఆర్ఎస్ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. మునుగోడు ప్రజల తీర్పుతో చెంప ఛెల్లుమంటుందని, టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే దాడులకు పాల్పడ్డారని వెల్లడించారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రచారం ముగియడానికి కొద్ది గంటలే ఉందనగా.. పలిమెల గ్రామంలో ఈటల కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు.
వీరిని ఈటల పరామర్శించారు. v6తో ఆయన మాట్లాడుతూ.. పలివెల గ్రామంలో టీఆర్ఎస్ కు బేస్ లేదని విమర్శించారు. పోలీసులను లెక్క చేయకుండా ఇలా వ్యవహరించడం దారుణమన్నారు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి చిల్లర వేషాలు, చిల్లర దాడులు కొత్తేమీ కాదన్నారు. ‘‘ కేసీఆర్ గూండాయిజానికి మేం భయపడం. పక్కా ప్లాన్ తో మాపై దాడి చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన రాళ్ల దాడిలో దాదాపు 15 ప్రచార రథాలు, వాహనాలు ధ్వంసం అయ్యాయి’’ అని ఈటల పేర్కొన్నారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించిన సందర్భంలో ఇలానే వ్యవహరించారనే విషయాన్ని గుర్తు చేశారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.