మరమనిషి కామెంట్లపై క్షమాపణకు టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేల పట్టు

మరమనిషి కామెంట్లపై క్షమాపణకు టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేల పట్టు

ఈటల మాట్లాడుతుండగా అడుగడుగునా అడ్డుతగిలి నినాదాలు
తాను సారీ చెప్తానో లేదో ఎలా డిసైడ్ చేస్తారని ఈటల ఫైర్
సస్పెన్షన్​తీర్మానాన్ని పెట్టిన ప్రశాంత్​రెడ్డి.. ఆమోదించిన సభ
మీడియా పాయింట్​లో మాట్లాడేందుకు అనుమతించని మార్షల్స్
శామీర్‌‌పేటలోని నివాసానికి తరలించిన పోలీసులు


హైదరాబాద్‌ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ను అసెం బ్లీ నుంచి స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి సస్పెండ్‌‌ చేశారు. ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెన్షన్ ఉంటుందని ప్రకటించారు. స్పీకర్‌‌ను మరమనిషి అంటూ ఇటీవల ఈటల చేసిన కామెంట్ల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్​రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి స్పీకర్​ ఆమోదముద్ర వేశారు. అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడేందుకు ఈటల ప్రయత్నించినా అనుమతించలేదు. ఆయన సొంత వాహనంలో వెళ్లేందుకు కూడా నిరాకరించారు. పోలీసుల తీరుపై మండిపడ్డ ఈటల.. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి నిర్బంధం లేదని మండిపడ్డారు. దీంతో పోలీసులు బలవంతంగా ఆయనను శామీర్​పేటలోని ఈటల ఇంటికి తరలించారు.

క్షమాపణకు అధికార పార్టీ పట్టు
మంగళవారం అసెంబ్లీలోకి ఈటల అడుగుపెట్టిన వెంటనే ఆయనకు వ్యతిరేకంగా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యేలు నినాదాలు మొదలుపెట్టారు. స్పీకర్‌‌‌‌ చైర్‌‌‌‌ను ఉద్దేశించి సభ బయట మర మనిషి అని ఈటల వ్యాఖ్యానించారని, సభా గౌరవాన్ని, స్పీకర్‌‌‌‌ గౌరవాన్ని కాపాడేందుకు ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ కోరాలని చీఫ్‌‌‌‌ విప్‌‌‌‌ దాస్యం వినయ్‌‌‌‌ భాస్కర్‌‌‌‌ డిమాండ్​ చేశారు. ‘సభలో ఉండే అర్హత ఈటలకు లేదు.. ఆయనను వెంటనే సస్పెండ్‌‌‌‌ చేయాలి’అంటూ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సభ్యులు రన్నింగ్‌‌‌‌ కామెంట్రీ చేశారు. ఈటల మాట్లాడుతూ.. తాను సభలో సభ్యుడిగా 19 ఏండ్లు పూర్తి చేసుకున్నానని, ఏ ఒక్క రోజు స్పీకర్‌‌‌‌ను ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. స్పీకర్​ తనకు తండ్రిలాంటి వారని అన్నారు. ఈటల ప్రసంగానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుతగిలారు. మంత్రి ప్రశాంత్‌‌‌‌ రెడ్డి జోక్యం చేసుకొని చైర్‌‌‌‌కు క్షమాపణ చెప్పి ఈటల చర్చలో పాల్గొనాలని సూచించారు. ‘క్షమాపణ చెప్పే ఉద్దేశం ఆయనకు లేదు. సస్పెండ్‌‌‌‌ చేయాలి’అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ‘స్పీకర్‌‌‌‌కు నేను క్షమాపణ చెప్తానా? లేదా? అనేది మీరేలా డిసైడ్‌‌‌‌ చేస్తారు. బెదిరిస్తున్నారా?’’అని ఈటల మండిపడ్డారు. ఈ క్రమంలో మంత్రి ప్రశాంత్‌‌‌‌ రెడ్డి ఈటలను సభ నుంచి సస్పెండ్‌‌‌‌ చేయాలని ప్రతిపాదించారు. ఆయనను సస్పెండ్‌‌‌‌ చేస్తున్నట్టు స్పీకర్‌‌‌‌ ప్రకటించారు. దీంతో ఈటల తన చైర్‌‌‌‌ నుంచి లేచి సభ బయటకు వచ్చేశారు.

మీడియా పాయింట్​లో మాట్లాడేందుకు నో
ఎమ్మెల్యే అలైటింగ్‌‌‌‌ పాయింట్‌‌‌‌ వద్దకు ఈటల చేరుకోగానే హైదరాబాద్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ సీపీ డీఎస్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ ఆయనను పోలీస్‌‌‌‌ వెహికల్‌‌‌‌ ఎక్కాలని సూచించారు. అరెస్ట్‌‌‌‌ చేస్తున్నామని చెప్తే పోలీస్‌‌‌‌ వెహికల్‌‌‌‌ ఎక్కేందుకు అభ్యంతరం లేదని ఈటల అన్నారు. అరెస్ట్‌‌‌‌ చేయడం లేదని, ఇంటికి తీసుకెళ్లి విడిచిపెడతామని ఆయన చెప్పారు. మీడియా పాయింట్‌‌‌‌లో మాట్లాడతానని ఈటల కోరగా.. చీఫ్‌‌‌‌ మార్షల్‌‌‌‌ కరుణాకర్‌‌‌‌ జోక్యం చేసుకుని అక్కడ మాట్లాడేందుకు స్పీకర్‌‌‌‌ అనుమతి ఇవ్వలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోసం ఎన్నోసార్లు సభ నుంచి సస్పెండ్‌‌‌‌ అయి మీడియా పాయింట్‌‌‌‌లో మాట్లాడాం కదా? ఇవేం రూల్స్‌‌‌‌ అంటూ ఈటల అసహనం వ్యక్తం చేశారు. ఈటల వాహనం అలైటింగ్‌‌‌‌ పాయింట్‌‌‌‌ వద్దకు వచ్చినా అందులో ఎక్కేందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో వారిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా ఈటలను తమ వాహనం ఎక్కించి శామీర్​పేట తరలించారు.

కేసీఆర్‌‌‌‌ను గద్దె దించే వరకూ విశ్రమించ: ఈటల
హుజూరాబాద్‌‌‌‌ లో తాను గెలిచినప్పటి నుంచి అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారని, తన గొంతు నొక్కుతూనే ఉన్నారని ఈటల ఆరోపించారు. ఏడాదిగా తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌‌‌‌ తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ఆయనను గద్దె దించే వరకు తాను విశ్రమించబోనని ప్రకటించారు. శామీర్‌‌‌‌పేటలోని తన నివాసానికి చేరుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సస్పెండ్‌‌‌‌ అయిన సభ్యులు మీడియా పాయింట్‌‌‌‌లోనూ మాట్లాడొద్దని అనడం ఏం ప్రజాస్వామ్యమన్నారు. సస్పెండ్‌‌‌‌ చేసిన తర్వాత తానేమీ ఆందోళన చేయలేదని, అయినా పోలీసులు తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని అన్నారు. పోలీసులు బానిసల్లా వ్యవహరించొద్దని సూచించారు.