డీ వన్ పట్టాల్లో అక్రమాలు వెలికితీస్తాం : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: నిర్మల్ నియోజకవర్గంలో జరిగిన  డీ వన్ పట్టాల అక్రమాలను వెలికి తీస్తామని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఆదివారం  తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  స్పష్టం చేశారు.   భూ ఆక్రమణలకు పాల్పడిన వారిని విడిచి పెట్టేది లేదన్నారు.

సీనియర్ సభ్యులను కాదని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం, మజ్లీస్ పార్టీ మెప్పుకోసమే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించిందన్నారు. ప్రభుత్వం సభా సంప్రదాయాలను ఉల్లంఘించిన కారణంగానే తాము  ప్రమాణ స్వీకారం చేయలేదన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.  తామంతా రాజ్యాంగబద్ధంగా ప్రొటెం స్పీకర్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపామన్నారు.

గవర్నర్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్లామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం  ఏర్పడితే ఎంతో అభివృద్ధి  జరిగేదన్నారు. మోసపూరిత మేనిఫెస్టో ఆధారంగా కాంగ్రెస్ అధికార లోకి వచ్చిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం సాగిస్తామని తెలిపారు.  సమావేశంలో  రావుల రామనాథ్,  మెడిసిమ రాజు, చందు, ముత్యంరెడ్డి, అర్జున్ జమాల్, వెంకటేశ్, రాచకొండ సాగర్, శంకర్ పతి, కొండాజి శ్రావణ్ పాల్గొన్నారు.