ఓటమి భయంతోనే 86 మందిని మునుగోడుకు పంపిండ్రు : ఈటల

మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదనే భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 86 మంది టీమ్ ను టీఆర్ఎస్ రంగంలోకి దింపిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ చెప్పుకుంటున్న తెలంగాణ గడ్డ మీద ఒక్కో ఎంపీటీసీ పరిధిలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. మునుగోడులో ప్రస్తుతమున్న పరిస్థితిని చూసి.. గొర్ల మందల మీద తోడేళ్లు పడ్డట్టు అయిందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో మునుగోడు ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

‘‘టీఆర్ఎస్ కు వంతపాడే విష పుత్రికలు హుజూరాబాద్ బై పోల్ సమయంలో 6 నెలల పాటు దుష్ప్రచారం చేశాయి. మునుగోడులో మరో 20 రోజులు ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆ మీడియా సంస్థలు కొనసాగించే అవకాశం ఉంది. మునుగోడు ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. హుజూరాబాద్ ప్రజల తీర్పునే పునరావృతం చేయాలి. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి’’ అని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

‘‘ఆ మీడియా సంస్థలు నిత్యం దుష్ప్రచారం చేసే పనిలోనే నిమగ్నమై ఉంటున్నయి. మార్ఫింగ్ చేస్తున్నరు. బీజేపీ నాయకులు అనని మాటలు అన్నట్టుగా చూపెట్టే పనులు చేస్తున్నరు. ఇలాంటి రండ పనులు హుజూరాబాద్ లో ఆరు నెలలు చేసిండ్రు.. మళ్లీ అలా చేయొద్దని చెప్పినా వినట్లే’’ అని వ్యాఖ్యానించారు. రెవెన్యూ , ఆర్టీసీ, పోలీసు, సింగరేణి కార్మికులు, నిరుద్యోగులు, గిరిజనులు, దళితులు అన్ని వర్గాల వాళ్లు ఏకమై మునుగోడులో కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్నారు.

గిరిజన బంధును ప్రకటించడంతో పాటు పేదరికంలో మగ్గిపోతున్న అన్ని వర్గాల కోసం పేదబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా పావలా వడ్డీ రుణ బకాయిలు రూ.3,750 కోట్లు ఉన్నాయని..  మునుగోడులో ఎన్నికల ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ మంత్రులను నిలదీసి, ఆ బకాయిలు విడుదల చేసేలా ఒత్తిడి పెంచాలని మునుగోడు మహిళలకు ఈటల సూచించారు.